విడుదల ఎప్పుడు లభించునో?
ఈనాడు ప్రపంచమంతయు, ఒక్కొక్క వ్యక్తియైనను, ఒక్కక్క దేశమైననూ ఒకరినొకరికి బానిసలుగా ఉండుటకు ఇష్టపడక, అందరు స్వేచ్ఛగానే ఉండవలెనని కోరుచున్నారు. భారతదేశమును బ్రిటిష్ వారి చేతినుండి విడిపించి, దేశము స్వాతంత్ర్యము పొందుటకు గాంధీగారు ఎన్నో పోరాటములు, నిరాహారదీక్షలు, జైలుజీవితాలు మొదలైనవన్నియు చవిచూడవలసి వచ్చెను!
దేశమునకు స్వాతంత్ర్యము లభించినను మానవుడు తన వ్యక్తిగత జీవితములో నేడు అనేక కార్యములలో విడుదలలేనివానిగా, ‘ఎప్పుడు నాకు విడుదల లేక స్వేచ్ఛ లభించునో?’ అనే తపనతో మూల్గులిడుచు నిట్టూర్పు విడుచుచున్నాడు. ఆదియందు దేవుడు మానవుని సృజించినప్పుడు అతనిని స్వేచ్ఛగాను, సమస్తాన్ని పరిపాలించేవానిగానూ, దేనికినీ దాసుడుకాకున్నవానిగా సృష్టించిరి. అతడు శాంతి, సంతోషము, విశ్రాంతిగలవాడై యుండెను. అయితే అతడు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు, “పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు” (యోహాను 8:34) అనే వాక్యానుసారముగా అతడు మానవుని తన చెరలో బంధించి మూసివేసెను. దాని నిమిత్తము పలువిధములైన వ్యాధులు, శాపములు, మరణభయము తదితరమైనవాటికి మనుష్యుడు దాసుడయ్యెను. ఈనాడుకూడ ఇలాంటి అనేక బానిసత్వములలో చిక్కుకొని, విడుదల లేక సత మతమవుచున్న మానవవర్గానికి ఇక విడుదల అంటూ లేనే లేదా అనే ప్రశ్న తలెత్తుచున్నది.
మానవుడు తన స్వప్రయత్నముచేత తన్నుతాను పాపమునుండి విడిపించుకొనలేడు. అంతేకాక మానవులందరు పాపముచేసి పాపులైయున్నందువలన ఏ మానవుడు కూడ ఈ బానిసత్వమునుండి మానవవర్గాన్ని విడిపించజాలడు. పాపపు చెరలో చిక్కుకొనిన మానవుని విమోచించుటకుగాను పాపము లేనివాడు అతని కొరకు బలి కావలెను. ప్రాణము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునది రక్తమే (లేవీ. 17:11). కావున పాపరహితుడైన దేవుడు పాపరహితమైన తమ రక్తమును కార్చి, బలియై, మానవుని పాపపు చెరలోనుండి విడిపింపవలసివచ్చెను. కావున, దేవాది దేవుడు మానవుని పట్ల దయాదాక్షిణ్యములు చూపి, పాపరహితునిగా ఈ ధరణిలో అవతరించి, పాపములేని పరిశుద్దునిగా జీవించి, మానవుని పాపములను తనపై వహించుకొని, అతని పాపములకొరకై సిలువలో మరణించిరి. ఆయన పవిత్ర రక్తమే మానవుని విడుదలకొరకు క్రయధనముగా సిలువలో చిందింపబడెను. ఈ విధముగా సిలువలో ప్రాణం ధారపోసిన ఆయన, సమాధి చేయబడిన మూడవ దినమున బహు గొప్ప శక్తులైన మరణము, పాతాళము మొదలగువాటిని జయించి తిరిగి లేచెను. ఆయనయొక్క సిలువ మరణమును, పునరుత్థానమును నమ్ము మానవునికి సదాకాలము విడుదల, నిశ్చయమైన విడుదల అనేది వాగ్దానము చేయబడెను. ఆ స్వేఛ్చను లేక విడుదలను పొంది అనుభవించుటకు మీరు ఏమి చేయవలెను?
ప్రభువైన యేసు ఈ లోకములో ఉండినప్పుడు, “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు” (యోహాను 8:36) అని తనను గురించి పలికిరి. కావున ప్రభువైన యేసు చెంతకు మీరు ఉన్నపాటునే వచ్చి, ఆయన మీకొరకు మరణించిరని విశ్వసించి, మీ కళ్ళు మూసుకొని, మీరు మీ చిన్నతనమునుండి చేసిన పాపములను విరిగిన హృదయంతో ఒక్కొక్కటిగా ఒప్పుకొనినచో, ఆయన మీ పాపములను క్షమించుదురు. తమ రక్తము ద్వారా మీ పాపడాగులను కడిగి శుద్ధీకరించి తమ బిడ్డగా మార్చుదురు. ఇకపై మీమీద అపవాదికి అధికారము లేదు. ‘ఎప్పుడో నాకు స్వాతంత్ర్యమని’ అంగలార్చే నీకు ఈనాడే స్వాతంత్ర్యము లభించును. పాపముల నుండి, చెడు అలవాట్లనుండి, రోగములు, శాపములనుండి, అప్పులబాధనుండి, కన్నీరు చింతలనుండి, సాతానుయొక్క చేతబడి శక్తులనుండి, మరణ భయమునుండి మీకు నేడు విడుదల. “సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును” (యోహాను 8:31, 32) ప్రభువైన యేసుక్రీస్తే మార్గము సత్యము జీవమునై యున్నారు. పాపమునుండి విడిపించుటకు ఆయనే మార్గము; స్వర్గపు దారిలో నడిపించుటకు ఆయనే సత్యము; నిత్యజీవము ప్రసాదించుటకు ఆయనే జీవము. ఆయనను అంగీకరించితే, ఈ లోకములో సమాధానము సంతోషము స్వాతంత్ర్యముగలవారముగా జీవించి, మరణానంతరాము ప్రభువైన యేసుతో పరలోకములో గొప్ప సుఖ సంతోషాలను పొంది జీవించగలము. పాపము, శాపము, వ్యాధి, మరితర బానిసత్వములనుండి స్వాతంత్ర్యము పొందగోరినయెడల మీ హృదయాంతరంగము నుండి ఈ క్రింద పేర్కొనబడిన ప్రార్థనను వల్లించండి.
“ప్రభువైన యేసూ, నా పాపములన్ని క్షమించి, నన్ను దాసునిగా చేయుచున్న సమస్తమైన బానిసత్వపు బంధకములనుండి నన్ను విడుదల చేయుము. మిమ్మును నా రక్షకునిగాను, దైవముగాను స్వీకరించుచున్నాను. ఇకను నేను మీ కొరకే జీవించెదను. ఆమేన్”.