11 / 100

Healing is yours_Telugu

పరమవైద్యుడైన యేసు

       మానవునికి ఐశ్వర్యము, విద్య, హోదాలు మొదలగునవన్నియు ఉన్నప్పటికిని అతడు తన జీవితములో విశ్రాంతి, సంతోషము, సమాధానము, శరీర సౌఖ్యము లేనివాడుగా ఉన్నాడు. సంతోషమును, సమాధానమును పొందుటకు అతడు విశ్వప్రయత్నాలు చేయుచున్నాడు.  దీని నిమిత్తము అతడు డబ్బు ఖర్చు పెట్టుచున్నాడు;  పలు పాప సంతోషాలలో జోక్యము చేసుకొనుచున్నాడు.  అయినను వాటిని అతడు పొందుటలో విఫలమగుచున్నాడు.  వీటివలన ప్రాణానికి నెమ్మది లేకుండా పోవుచున్నది, దేహములో రోగమునకు, మరణమునకు అవి దారితీయుచున్నవని అతడు తెలిసికొనలేని స్థితిలో కనబడుచున్నాడు.

         దేవుడు తన స్వరూపమందు తన పోలికెచొప్పున నరుని సృజించుటయే గాక, అతనిని సంతోషము, సమాధానము, విశ్రాంతిగలవానిగా, వ్యాధి లేని ఆరోగ్యవంతునిగా, నిత్యజీవముగలవానిగా కలుగజేసిరి.  అయితే దేవునియొక్క నియమమును అతిక్రమించి అతడు పాపము చేసినప్పుడు, తనకున్న ఆశీర్వాదములను అతడు కోల్పోవుట మాత్రమేగాక. ప్రాణములో మరణము, భయము,దిగులు, శరీరములో తీరని రోగము, బలహీనత మొదలగువాటికి అతడు బానిసుడాయెను.

         రోగమునుండి స్వస్థత పొందుటకుగాను పలువిధములైన వైద్య చికిత్సలు, పైశాచిక విద్యలు (Medical healing, Demon healing)  మొదలగు పలు విధానములను అవలంబించినను, వాటిలో ఒక్కటికూడ మానవునికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించలేదు;  సరేగదా వ్యాధినుండి స్వస్థత పొందుటకు కొన్ని మందు మాత్రలను మ్రింగితే దాని వలన అవాంఛనీయమైన దుష్ఫలితాలు, క్రొత్త క్రొత్త రోగములు సోకుచున్నవి.  వైజ్ఞానికరంగములో నూతన పద్ధతులను ఉపయోగించి క్రొత్త క్రొత్త మందులను కనిపెట్టినప్పటికిని, క్రొత్త క్రొత్త రోగములుకూడ పెరుగుచున్నందువలన వైద్యరంగమునకు ఇదొక సవాలుగా మిగిలియున్నది.  ఇటువంటి పరిస్థితిలో, నా రోగమును బాగుచేయుటకు ఈ ఇరవైయవ శతాబ్దములో ఏ వైద్యుడును లేడా?  అనే ప్రశ్న మీ మనస్సులో చెలరేగి మిమ్మును కలవరపెట్టవచ్చును.

          స్నేహితులారా, మీకొక వైద్యుని పరిచయము చేయుచున్నాము.  మీరు విశ్వాసముతో ఆయన యొద్దకు వస్తే చాలు,  ఆయన ఈ మానవ వర్గమునకు తగిన పరమ వైద్యుడు. యేసు అనే నామముగల ఆయన, నిన్ను స్వస్థపరచు యెహోవాను (దేవుడను) నేనే అని చెప్పుచున్నారు (నిర్గమ. 15:26).  ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను; అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది 

 (మత్తయి  8:17; యెషయా  53:5).  నేను మీకు విశ్రాంతి కలుగజేయును (మత్తయి 11:28) అని ఆయన మిమ్మును పిలుచుచున్నారు.

      మీరు మీ పాపములను ప్రభువైన యేసుయొద్ద పశ్చాతాపముతో ఒప్పుకొని, ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆయన మీ పాపములను క్షమించి, మీ ప్రాణానికి విశ్రాంతినిచ్చుట మాత్రమేగాక, మీ శరీరములోని రోగములను తొలగించి, మీకు పూర్ణ స్వస్థతను ఉచితముగా అనుగ్రహించెదరు. మీ పాపముల నిమిత్తము మీరు పొందవలసిన శిక్షను తానే భరించి, మీకొరకు సిలువలో తన ప్రాణము ధారపోసెను. ఆయన మీకొరకు మరణించుట మాత్రమేగాక, ఆయన పునరుత్థానుడై మీ కొరకే నేడు నిరంతరమూ జీవించుచున్నారు.  ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలోనుండి  నీ ప్రాణమును నిమోచించుచున్నాడు  (కీర్త. 103:3,4); ఆయన (యేసు) తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను.  ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థతనొందితిరి (1 పేతురు 2:24) అని వేదం పలుకుచున్నది.

          వైద్యవిజ్ఞానము, శస్త్రచికిత్స విధానములు మనస్సును, ప్రాణమును బాగుచేయలేవు.  ప్రభువైన యేసు ఉచితముగా ప్రసాదించే దైవిక స్వస్థత, శరీరమును మాత్రమే కాదు, మనస్సును ప్రాణమును మానవ జీవితపు పలువిధ అంశములను బాగుచేయగలరు.

        కావున, మీరు ఇప్పుడే స్వస్థతనొందగోరినట్లయితే, మీ వ్యాధి ఎటువంటిదైనను, మీరు వైద్యులవలన విడువబడినవారైనను, మీ జీవితమంతటిని ప్రభువును పరమ వైద్యుడునైన యేసుయొక్క హస్తములలో సమర్పించి, ఈ క్రింది ప్రార్థనను వల్లించండి :

       యేసు ప్రభువా, మీరు నా పాపములకొరకు మాత్రమే కాదు, నా రోగములనుండికూడ నన్ను విడపించుటకుగాను కల్వరీ సిలువలో మరణించిరని నేను నమ్ముచున్నాను.  నా పాపములన్నింటిని కృపచేత క్షమించి, నా రోగమునుండి   విడిపించి, నాకు సంపూర్ణ స్వస్థత నివ్వండి.  ఇకమీదట నేను పాపము చేయను, మీ బిడ్డగా జీవించెదను.  ఆమేన్.

 

 

You can find equivalent English tract @

Healing is yours!