నీ కన్నీరు తుడిచే దేవుడు
దేవుడు మానవుని తన పోలికె చొప్పున తన రూపము చొప్పున సృజించెను. దేవుడు అతనిని సృష్టించిన దినమున అతడు దేవునితో సహవాసము గలవానిగా, తనలోనే సంతోషము, మనఃశాంతిగలవానిగా, మరితర జీవరాసులతో ఎటువంటి వైరము లేక వాటితో కలిసిమెలిసి జీవించుచుండెను. అయినను అటువంటి పరిస్థితిలోనే కాపాడబడవలసిన మానవుడు దేవునికి అవిధేయుడై పాపము చేసి, దేవునితో ఉన్న సహవాసమునుండి తెంపివేయబడి ఒంటరివాడయ్యెను. పాపపు చీకటి అతనిని ఆవరించెను. అతడు తన సంతోష సమాదానములను కోల్పోయెను. అప్పటినుండి మానవుడు తన బ్రదుకులో అనేక విధములైన పోరాటములను, సమస్యలను ఎదుర్కొనుచుండెను. వ్యాధి, మరణభయము, ఆకలి, అప్పులబాధ, నిందలు, కుటుంబములో చీలికలు, నిరుద్యోగసమస్యలు, చేతబడులు మొదలగువాటి ద్వారా అతడు రోగపీడితుడై సతమతమవుచున్నాడు. ఈ స్థితిలో అతడు తన సమస్యలకు పరిష్కారము కనుగొనలేక, నన్ను ప్రేమించుటకైనను, పట్టించుకొనుటకైనను, మనోభారమును పంచుకొనుటకైనను ఎవరు లేరే అని తలంచి కృంగిపోవుచున్నాడు. వీటిద్వారా నిరాశతో ఆత్మహత్యకు పాల్పడేవారు ఉన్నారు.
ఇలాంటి ఆవేదనకరమైన స్థితిని ఎవరియొద్ద చెప్పుదును అని చింతించే స్నేహితుడా! మీ పరిస్థితిని పూర్తిగా ఎరిగిన ప్రభువైన యేసు మీ కొరకు జీవించుచున్నాడు. ఆయన మిమ్మును విడిపించుటకు శక్తిమంతుడు. ఆయన మిమ్మును కనికరించే దేవుడు. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగాజేతును (మత్తయి 11:28) అని ఆయన నిన్ను పిలుచుచున్నారు. ఆ ప్రభువైన యేసు యొద్దకు మీరు వచ్చెదరు గాక.
‘నేనాయేసు యొద్దకు రావడానికి ఆయన ఎవరు? నాకాయన తెలియదే’ అని మీరంటే, ఇదిగో, మేము ఈ కరపత్రిక ద్వారా ఆయనను మీకు పరిచయము చేయుచున్నాము. ఆయనే, మానవ జాతిని సృష్టించిన సృష్టికర్త. పాపము చేసినందువలన మానవుడు దేవుని విడిచి వేరై ఘోర వేదనలను అనుభవించుటను దేవుడు ఎరిగినవారై, మానవునిపై ఆయనకున్న ప్రేమనుబట్టి అతనికొరకు మానవునిగా, పాపముతో సంబంధము లేనివానిగా, కన్యక గర్భములో జన్మించెను. ఈ పాపప్రపంచములో పరిశుద్ధునిగా జీవించెను. ఆయనలో పాపములేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము నెరుగకుండెను. రోగులను బాగుచేయుచు, గ్రుడ్డివారి కండ్లు తెరచుచు, కుష్ఠరోగులను స్వస్థపరచుచు, దయ్యముల బాధనుండి ప్రజలను విడిపించుచు, ఆయన అందరికీ మేలు చేయుచు సంచరించిరి. అయినను మానవవర్గముయొక్క పాపములకు ప్రాయశ్చిత్తము చేయు పాపపరిహారార్ధబలిగా, ఆయన అవతరించినందువలన, మానవ విమోచనకొరకు ఆయన కల్వరీ సిలువలో మరణించవలసి వచ్చెను. ఆయన పాపములేని పునీతుడై యున్నందువలన మరణించి, పాతిపెట్టబడి మూడవ దినమున పునరుత్థానుడయ్యెను. ఈ విధముగా ఆయన మానవుని పాపములను శాపములను రోగములను తనపై వహించుకొని మానవుని కొరకు మరణించి పునరుత్థానము చెంది, నేడు నిరంతరము మారనివాడై నేడును మీకొరకే జీవించుచున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనయందు విశ్వాసముంచువాడెవడో అతడుఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును (అపా. 10:43). ఆయనయందు విశ్వాసముంచి మీ పాపములను యథార్థమైన పశ్చాత్తాపముతో ఆయనయొద్ద ఒప్పుకొనినచో, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమునుండి మిమ్మును విడిపించి పవిత్రులనుగా చేయును (1 యోహాను 1:7).
ఇప్పుడు ఆయన మీతో ఇలాగు మాట్లాడుచున్నారు. “నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను” (II రాజులు 20:5). “దుఃఖించువారిని ఓదార్చుదును” (యెషయా 57:18). “నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు”; “నీ దుఃఖదినములు సమాప్తములగును” (యెషయా 30:19; 60:20).
దీనిని చదువుచున్న నేస్తమా! మిమ్మును పట్టించుకొనుటకుగాను, మీ దుఃఖములను మోయుటకుగాను, మీ చింతలను మార్చుటకుగాను, మీ కన్నీళ్ళను తుడచుటకుగాను, మీకు సమాధానసంతోషాలు ప్రసాదించుటకుగాను, మిమ్మును మరణభయమునుండియు వ్యాధులనుండియు విడిపించుటకుగాను, మీకు పవిత్రమైన జీవితమును ప్రసాదించి, మోక్షలోకమునకు మిమ్మును చేర్చుటకుగాను, ప్రభువైన యేసు మీకొరకే జీవించుచున్నారు. నేడు తక్షణమే ఆయన యొద్దకు విచ్చేయుదురు గాక! రేపు మీది కాదు. “ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము” (II కౌరింథీ. 6:2).
మీ కన్నీరు, చింతలనుండి విడుదల పొందుటకు ప్రభువైన యేసుని నమ్మి ఈ క్రింది ప్రార్థనను వల్లించండి.
“ప్రభువైన యేసూ, మీరు నా పాపములన్నిటిని క్షమించి, నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. మిమ్మును నా దేవునిగాను, రక్షకునిగాను, నేను అంగీకరించుచున్నాను. నా కలతలన్ని తీర్చి, మీ సంతోషముతో నన్ను నింపుము. మీకొరకు నేను జీవించెదను. ఆమేన్”.