Has ur name been registered telugu

 

    మీరు ఈ భూమిమీద జన్మించినప్పుడు, జనన మరణ కార్యాలయములో మీ తల్లిదండ్రులు మీ పుట్టుకను నమోదు చేయుదురు. మీరు బడిలో చేర్చబడెనప్పుడు, మీరు కళాశాలలో చేర్చబడెనప్పుడు, మీరు ఉద్యోగములో చేరినప్పుడు, మీరు పొలముగాని ఇల్లుగాని కొనునప్పుడు, మీరు వివాహము చేసికొనినప్పుడు, వాహనములకు భీమా చేయునప్పుడు, మీరు బ్యాంకులలో జమాఖర్చుల లెక్క మొదలుపెట్టునప్పుడు, మీ గృహమునకు విద్యుత్ సరఫరా లభించునప్పుడు – ఈ లోకములో ఆయాచోట్ల మీ పేరు నమోదు చేయబడుచున్నది.  కుటుంబపట్టిక (రేషన్ కార్డ్)లో మీ పేరు నమోదు చేయబడుచున్నది.   ఈ విధముగా మీరు అనేక కార్యములలో మీ పేరును నమోదు చేయునప్పుడు ఆయా హక్కులను, మేళ్ళను అనుభవించగలరు.  నాశనమైపోవు ఈ ప్రపంచములో, జీవనము సాగించడానికి, ఇన్ని చోట్లలో పేరు నమోదు చేయవలసియున్నట్లయితే, మీరు మీ మరణానంతరము సదాకాలము, నిత్యానిత్యము స్వర్గము లేక మోక్షములో సమాధానముగాను సంతోషముగాను జీవించుటకు మీ పేరు ఇప్పుడే అక్కడ నమోదు చేయబడ వద్దా?  అవును, మీ పేరు తక్షణమే అక్కడ నమోదు చెయ్యాల్సిందే.

అక్కడ మీ పేరు నమోదు చేయబడుటకు మీరు ఏమి చేయవలెను?  అందుకోసము పరలోకములోనున్న దేవుని కుటుంబములో ఒక సభ్యునిగా మీరు జన్మింపవలెను.  దానిగురించి పరిశుద్ధ వేదగ్రంథము, “తనను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన (ప్రభువైన యేసుక్రీస్తు) నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” (యోహాను  1:12)అని మనం చదువగలము.  ప్రభువైన యేసుని పూర్ణహృదయముతో మీరు విశ్వసించి, ఆయనను మీ స్వంత రక్షకునిగాను ప్రభువుగాను స్వీకరించినట్లయితే, మీ ఆయన బిడ్డగా మార్చబడుదురు.  ఆయనే మీ పాపములకొరకై మీరు పొందవలసిన శిక్షను కల్వరీ సిలువలో వహించుకొని, మీకొరకు మరణించిరి.  ఆయన మరణించుట మాత్రమే గాక, మూడవ దినమున పునరుత్థానము చెంది, సదాకాలము జీవించుచున్నారు.  మీ చిన్నప్రాయము మొదలుకొని ఇప్పటివరకు చేసిన పాపములను మీరు పశ్చాత్తాపముతో ఒక్కొక్కటిగా ఆయనయొద్ద ఒప్పుకొనినచో,  ఆయన మీ పాపములను క్షమించి,మిమ్మును తన బిడ్డగా అంగీకరించెదరు.  మీ హృదయమును తన సంతోషముతోను సమాధానముతోను ఆయన నింపెదరు.  ఈ విధముగా తన బిడ్డలుగా మార్చబడినవారితో, ఈ లోకములో ఉన్నప్పుడే, “మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని” వారితో చెప్పెను (లూకా 10:20) ప్రభువైన యేసుని విశ్వసించి, పాపక్షమాపణ పొందువారియొక్క పేరులు పరలోకములో నమోదు చేయబడుచున్నవి.  అంతేకాక “వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు” (1యోహాను 3:9) అని వేదగ్రంథము చెప్పునట్లుగా, ఇటువంటివారు ఇకను పాపము చేయకుండా ఈ పాప

ప్రపంచములో పవిత్రముగా బ్రదుకుటకు ప్రభువైన యేసు వారికి అనుగ్రహము చూపుచున్నారు.  ఇంకను ప్రభువైన యేసు కల్వరీ సిలువలో మీకొరకు మరణించినప్పుడు మీ పాపములను మాత్రమే గాక, మీ వ్యాధులనుకూడ ఆయన వహించెను.  కావున విశ్వసించువారు తీరని రోగములనుండి స్వస్థతపొంది ఆరోగ్యముతో జీవనం సాగించగలరు..

ఇది ఇలా ఉండగా, పరలోకములో తమ పేరులు నమోదుచేయబడనివారి అంతము ఏమి?  మరణానంతరము జరిగే న్యాయవిమర్శ దినమున వారికి సంభవించుదాని గురించి “ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడనియెడల వాడు అగ్నిగుండములో (నరకాగ్నిలో) పడవేయబడెను” (ప్రక. 20:15) అని వ్రాయబడియున్నది.

ప్రభువైన యేసుయొక్క రక్తము, మీ పాపములను తుడిచివేసి క్షమాపణను, ఆయన సిలువ మీ శాపమును తొలగించి ఆశీర్వాదమును, ఆయన పొందిన గాయములు మీ రోగములను తీర్చి స్వస్థతను, ఆయన మరణము మీ మరణ భయమును తొలగించి ధైర్యమును ప్రసాదించుచున్నది.  ప్రభువైన యేసుయొక్క జీవముద్వారా నిత్యజీవమును మీరు పొందగలరు.  మీ పేరు భూమిమీద కాదు, పరలోకములో ఉండే జీవగ్రంథమందు వ్రాయబడును.  ఇహమందు లోకమివ్వజాలని నిజమైన శాంతి సంతోషములను, మరణానంతరము పరలోకములో ప్రవేశించే ధన్యతను పొంద ఈనాడే ప్రభువైన యేసుచెంతకు రండి!  ప్రభువైన యేసుని విశ్వసించి ఈ క్రింది ప్రార్థనను వల్లించండి.

   “ప్రభువైన యేసూ, నేను మిమ్మును నమ్మి, నా జీవితమును సంపూర్ణముగా మీకు అర్పించుచున్నాను.  నా పాపమంతయు పోవునట్లు నన్ను మీ పవిత్రమైన రక్తముచేత కడిగి పవిత్రపరచి మీ బిడ్డగా స్వీకరించి, పరలోకమందు ఇప్పుడే నా పేరును నమోదు చేయుము. ఇక నా జీవితాంతము నీ బిడ్డగానే నేను జీవించెదను.  ఆమేన్” 

 

For more information please contact: contact@sweethourofrpayer.net

You can find equivalent English tract @

Is your name registered ?